Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): తాండూరు, పరిగి కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అధిష్టానం నుంచి అక్షింతలు పడినట్టు తెలిసింది. ఈ సభ సందర్భంగా డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేయడంలో రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లడంతో వెంటనే డీకే శివకుమార్‌కు ఏఐసీసీ నుంచి కీలక నేత ఒకరు ఫోన్ చేసి.. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ‘రేవంత్‌రెడ్డిని సీఎంగా ఎవరు ప్రకటించమన్నారు? అసలు మీరు చేస్తున్న ప్రసంగానికి అనువాదం ఏం చేస్తున్నారో కనీసం గమనించారా? అని ఆ నాయకుడు ప్రశ్నించినట్టు సమాచారం. తాండూరు, పరిగి రెండు సభల్లోనూ అక్కడి అభ్యర్థులు రేవంత్‌రెడ్డి సీఎం అని ప్రకటించారు. దీనిపై పార్టీలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు నెలల వ్యవధిలోనే కర్ణాటకను ఆగమాగం చేసిన కాంగ్రెస్ సర్కారు అబద్ధాలతో డర్టీ గేమ్ మొదలుపెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్కడి ‘5 గ్యారెంటీ స్కీమ్’లపై అబద్ధాలు వల్లెవేశారు. ఇచ్చిన హామీమేరకు అన్ని గ్యారంటీలను నెరవేర్చినట్టు అసత్యాలు ప్రవచించారు.