హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మోకాళ్ల యాత్ర చేపట్టినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. అచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్న ఆ పార్టీని ప్రజలు నమ్మబోరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి.. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 ఎన్నికల్లో రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, పింఛన్లు పెంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరూ అడగకముందే దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించి, అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.