SC Sub Plan Funds | హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చట్టం చేసిన కాంగ్రెస్ సర్కారు.. సబ్‌ప్లాన్ నిధులను ఖర్చుపెట్టే అంశంపై బడ్జెట్లో ఎక్కడా స్పష్టతనివ్వలేదు. ఆయా క్యాటగిరీల వారీగా నిధులను కేటాయిస్తారా? గతంలో మాదిరిగానే గంపగుత్తగా వెచ్చిస్తారా? అనే విషయాన్ని కూడా లేశమాత్రమైనా ప్రస్తావించలేదు. సబ్‌ప్లాన్ బడ్జెట్లో ఆయా ప్రభుత్వ శాఖలకు ఏకమొత్తంగానే నిధులను పొందుపరచింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది.
ఆయా గ్రూపుల వారీగా రిజర్వేషన్లను కేటాయించింది. ఆ నివేదిక మేరకు కాంగ్రెస్ సర్కారు ఇటీవలే చట్టం కూడా చేసింది. ప్రస్తుతం విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలోనూ ఇదే నిష్పత్తిని అమలు చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. అయితే ప్రభు త్వం మాత్రం నిధులను ఖర్చు చేసే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభుత్వం 2017 ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అనుసరించి 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో మొత్తంగా ప్రగతిపద్దు కింద రూ.1,74,710.69 కోట్లను కేటాయించింది. అందులో ఎస్సీ జనాభా దా మాషా ప్రకారం రూ.40,232 కోట్లను కేటాయించింది. వాస్తవంగా సబ్‌ప్లాన్ నిధులను మొత్తంగా అగ్రికల్చర్, విద్యాశాఖ, లేబర్, ఎంప్లాయ్మెంట్, హౌజింగ్, సెర్ప్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆర్అండ్బీ, ఎస్సీ, హార్టికల్చర్, బీసీ ఇలా మొత్తంగా 34 శాఖల వారీగా పొందుపరించింది.
ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం ఏ గ్రూపులోని 15 కులాలకు 1శాతం అంటే రూ.2682.13 కోట్లను, బీ గ్రూప్‌లోని 18 కులాలకు 9శాతం అంటే రూ. 24139.17 కోట్లు, సీ గ్రూపులోని 26 కులాలకు రూ.13,410.70 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్లో ఏకమొత్తంగానే సబ్‌ప్లాన్ నిధులను కేటాయించింది. ఆయా శాఖలకు సైతం అదేవిధంగా పొందుపరిచింది. ఎక్కడా వర్గీకరణ చట్టాన్ని, ఆ దా మాషా ప్రకారమే వెచ్చించాలనే అంశాన్ని కూడా సబ్‌ప్లాన్ బెడ్జెట్లో ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో నిధుల ఖర్చుపై ఇప్పుడు గందరగోళం నెలకొన్నది. గతంలో మాదిరిగానే ఏకమొత్తంగా సబ్‌ప్లాన్ నిధులను వెచ్చిస్తారా? లేదంటే వర్గీకరణ శాతానికి అనుగుణంగా ఖర్చు చేస్తారా? అనే విషయంలో స్పష్టతలేదు. జనాభా నిష్పత్తి ప్రకారమే ఖర్చు చేయాలని ఇప్పటికే ఆయా ఎస్సీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్ర సర్కారు నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాలనే ఈ ఏడాది కూడా కాపీ చేసింది. పలు పథకాలకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో పొందుపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్నది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందిస్తామని నిరుటి బడ్జెట్లో పేర్కొన్నది. ఇదే అంశాన్ని తాజా బడ్జెట్లోనూ ప్రస్తావించింది. ఇలాగే అనేక అంశాలు రిపీట్ చేస్తూ అంకెల గారడీతో మభ్యపెట్టింది.