హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ సాగు కోసం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఫ్యాక్టరీ జోన్ ఏర్పాటు అనుమతులను రద్దు చేసూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. పతంజలికి ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పతంజలి సంస్థ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్‌పామ్ (ఎన్ఎంఈవో-వోపీ) పథకం కింద పతంజలి (గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్)కి 2012లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ కోసం ఫ్యాక్టరీ జోన్లను కేటాయించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో ప్రాసెసింగ్ మిల్లు ప్రారంభించాలన్న షరతు అమలు చేయలేదంటూ సూర్యాపేట ఫ్యాక్టరీ జోన్ కేటాయింపును రద్దు చేస్తూ నిరుడు మార్చి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యను సవాల్ చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీనిపై పతంజలి దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. ప్రధాన పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.