వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు, ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78 వేల కోట్లకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే సేకరించిన కేంద్రం..ఈ లక్ష్యానికి చేరుకోవడానికి మరో రెండు నెలలు మాత్రమే మిగిలింది. ఈ ఏడాదిలోనే బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాను విక్రయించాలనుకుంటున్నది. వీటిలో ఎయిర్ ఇండియాను విక్రయించడంతో రూ.2,700 కోట్ల నిధులు సమకూరగా, మిగతా రూ.9,330 కోట్లు ఇతర పీఎస్యూల్లో వాటాలను విక్రయించడం ద్వారా సమకూరాయి. ఈ ఏడాదిలోనే ఎల్ఐసీతోపాటు బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్ప్, ఆర్ఐఎన్ఎల్, పవన్ హన్స్ వంటి సంస్థల్లో వాటాలను విక్రయించడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి చేరుకోకపోవడం ఇది వరుసగా మూడోసారి. 2020-21లో రూ.2.10 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ సర్కారు..కేవలం రూ.37,897 కోట్లు సేకరించింది. అలాగే 2019-20లో రూ.1.05 లక్షల కోట్లకు బదులు రూ.50,298 కోట్లు వచ్చాయి. కానీ, 2018-19, 2017-18లో మాత్రం లక్ష్యాన్ని అధిగమించింది.