హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డితో కలిసి కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు న్యాయశాఖకు సంబంధించిన పలు అంశాలపై విస్త్రృతంగా చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో అదనపు జిల్లా జడ్జి కోర్టులు ఉన్నందున ఆయా ప్రాంగణాల్లోనే జిల్లా జడ్డి కోర్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా కోర్టులో ఉన్న కేసులను ఆయా కొత్త జిల్లా కోర్టులకు బదిలీ చేస్తారు. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో బాధితులకు తకువ సమయంలో న్యాయం అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.