మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 22: పార్లమెంట్ ఎన్నికలకు కోడ్ కూయనేలేదు.. కాం గ్రెస్ నేతలు అడ్వాన్స్‌గా కానుకలు అందజేస్తూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు మండలాల్లో హస్తం పార్టీ గుర్తు, సీఎం రేవంత్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే వంశీచందర్‌రెడ్డి ఫొటోలతో కూడిన గోడ గడియారాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు.
ఈ విషయం జిల్లాలోని హన్వాడ మండలంలో గురువారం వెలుగుచూసింది. ‘మీ ఇంటికి గడియారం వచ్చిందా?’ అంటూ ఆ పార్టీ నాయకులు అడుగుతుండటంపై గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. ఎన్నికల కోడ్ రాకముందే గడియారాల పంపిణీ పూర్తి కావాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలోనూ ఈ గడియారాలను అందించినట్టు తెలుస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతలు గడియారాలు అందించి ఓటర్లను ప్రభావితం చేయడం సరికాదని ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.