నిజామాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మల్యాల/గొల్లపల్లి/కామారెడ్డి రూరల్: పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సోమవారం పోలీసు పహారా నడుమ విత్తనాలు పంపిణీ చేయడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలకు భారీ డిమాండ్ ఉంది. ప్రాథమిక సహకార కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. డిమాండ్‌కు సరిపడా స్టాక్‌ను ఉంచలేదు. దీంతో రైతులు తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల ఎదుట క్యూ కట్టారు. ఎండకు తాళలేక చెప్పులు, పాస్బుక్ల జిరాక్స్ ప్రతులను లైన్లో పెట్టి పొద్దంతా నిరీక్షించారు. మొన్న రాజంపేటలో రైతన్నలు ఎండలో నిల్చొని సొమ్మసిల్లారు. తాజాగా కామారెడ్డిలోని పీఏసీఎస్‌లో పోలీస్ పహారా నడుమ జీలుగ విత్తనాలను పంపిణీ చేయాల్సి వచ్చింది. వానకాలం సీజన్‌కు ముందే రైతులకు విత్తనాలు, ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ సమస్య లేకుండా.. వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న అన్నదాతలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విత్తనాల స్టాక్ కొద్దిగా ఉండటం, భారీగా రైతులు తరలిరావడంతో సిబ్బందికి ఏం చేయాలో తోచక.. పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులపై భూమి విస్తీర్ణాన్ని బట్టి జీలుగ విత్తన సంచులను సరఫరా చేసేందుకు టోకెన్లు రాసిచ్చారు. అయినా.. గందరగోళం నెలకొనడంతో చివరకు పోలీసుల భద్రత నడుమ విత్తనాలు పంపిణీ చేశారు. పోలీస్ పహారాలో విత్తనాల పంపిణీ అన్నది కాంగ్రెస్ మార్క్ పరిపాలనకు కేరాఫ్ అడ్రస్ అంటూ రైతులు దుమ్మెత్తి పోశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదని, అప్పట్లో సవ్యంగా సాగిన ప్రక్రియకు ఇప్పుడు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంతోపాటు పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్ పాయింట్లు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా అందజేసే జనుము, జీలుగ బస్తాలు పంపిణీ చేయడంతో రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మల్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతుల పాసుపుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలో పెట్టారు. మల్యాల, నూకపల్లి, పోతారం సహకార సంఘాల వద్ద రైతులకు ఎరువుల బస్తాలు లభ్యం కాకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్లారు. ఈ విషయమై మల్యాల మండల వ్యవసాయాధికారి చంద్రదీపక్ను వివరణ కోరగా మండలానికి అవసరమయ్యే జీలుగ, జనుము బస్తాల కోసం పెట్టిన ఇండెంట్లో కేవలం 50 శాతం మాత్రమే రావడంతో రైతులకు సోమవారం బస్తాలు దొరకలేవని, మిగతా 50 శాతం బస్తాలు మరో మూడు రోజుల్లో వస్తాయని, రాగానే రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న జీలుగ విత్తనాలను ఒక్కో పాస్బుక్కు ఒక్క బస్తానే ఇచ్చారు. దీంతో ఐదెకరాల భూమి ఉన్న వారికి ఒక బస్తా ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. ఒక్క బస్తా కోసం రోజంతా కేంద్రాల వద్ద పడికాపులు కాయాల్సి వచ్చిందని మండిపడ్డారు. డీసీఎంఎస్ నిర్వాహకుడు రైతుల పాస్ బుక్‌ల జిరాక్స్ తీసుకుని పేర్లు పిలుస్తూ రైతుకు ఒక బస్తా చొప్పున అందించారు.
విత్తనాల కోసం సర్కారుకు ఇండెంట్ పెట్టాం
కామారెడ్డి జిల్లాలో సోమవారం పీఏసీఎస్ ద్వారా రైతులకు 833 బస్తాల జీలుగ, 282 బస్తాల జనుము విత్తనాలను విక్రయించాం. ఏఈవోల ద్వారా సమాచారం అందించడంతో రైతులందరూ ఉదయమే పీఏసీఎస్‌కు చేరుకొని క్యూలో నిలబడ్డారు. ఆన్లైన్లో పర్మిట్, బిల్లు జనరేట్ చేసేందుకు సమయం పట్టడంతో లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అదనంగా జీలుగ, జనుము విత్తనాలు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. రాగానే సమాచారం ఇచ్చి అందరికీ పంపిణీ చేస్తాం.
-భాగ్యలక్ష్మి, కామారెడ్డి జిల్లా
వ్యవసాయ అధికారిణిమమ్మల్ని పట్టించుకుంటలేరు
జీలుగ విత్తనాల కోసం పొద్దున్నే కామారెడ్డికి వచ్చినం. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. పాస్‌బుక్ జిరాక్స్ తెచ్చుకోమన్నారు. దానిపై బస్తాలు రాసిచ్చిండ్రు. గంటల కొద్దీ నిలబడితే కానీ విత్తనాలు చేతికి రావడం లేదు. వరుసలో నిలబడినా విత్తనాలు దొరుకుతయో.. దొరుకవో తెలియని అయమోయం నెలకొంది.
-లింగం, రైతు, ఉగ్రవాయి
దుబ్బాకలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీ
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఫర్టిలైజర్ దుకాణాలను సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ, కల్తీ విత్తనాలు , ఎరువులు విక్రయిస్తే లైసెన్సు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.