హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గొల్ల కురుమలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నది. ఈ మేరకు మంగళవారం గొర్రెల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. జూన్ 5న నల్లగొండ జిల్లాలో లబ్ధిదారులకు మంత్రి తలసాని స్వయంగా గొర్రెలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేయనున్నారు.