నల్లగొండ ప్రతినిధి, జూలై 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈనెల 14 నుంచి చేపట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా 14న రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజ ల నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ నెల 13 వరకు పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి కొత్తగా రేషన్‌కార్డులను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 3వ వారంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ లైడార్ సర్వే చేపట్టనున్నామని, దీని ద్వారా పనుల నిర్వహణపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి డుమ్మా
కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమీక్షకు డుమ్మా కొట్టారు. రాజగోపాల్‌రెడ్డికి సమాచారం ఇచ్చినా కావాలనే హాజరుకాలేదని తెలిసింది. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్‌రెడ్డి ఇలాంటి మీటింగ్‌లకు పోవాల్సిన అవసరం ఏమిటన్న ధోరణితో ఉన్నట్టు సమాచారం.