గజ్వేల్, ఆగస్టు 11: రైతాంగం కోసం సీఎం కేసీఆర్ కష్టపడి మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి గజ్వేల్ గడ్డమీదకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం బీసీ కుల వృత్తిదారులకు లక్ష సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే పార్లమెంట్ సాక్షిగా బండి సంజయ్‌తోపాటు ఇతర బీజేపీ ఎంపీలు పచ్చి అబద్ధ్దాలు మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.85 వేల కోట్లు కాదు కదా 85 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధ్దాలు మాట్లాడిన చరిత్ర బీజేపీకే నాయకులకే దక్కిందని విమర్శించారు. కేసీఆర్ సర్కారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ల ఖాతాలో వేసుకునే దుర్బుద్ధి బీజేపీకి పుట్టిందని అన్నారు. ‘మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలే అనే నైజాన్ని మరోసారి బీజేపీ నాయకులు బయటపెట్టారు.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేమే ఇచ్చినమంటే మందికి పుట్టిన పిల్లలను ముద్దాడినట్లే ఉన్నది. ఈసొంటి బీజేపీ, మూడు గంటల కరెంట్ సాలన్న కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాల్సిందే. మన సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టాల్సిందే. కాంగ్రెసోళ్లు ఏమో కాళేశ్వరం కట్టకుండా అడ్డుపడి కేసులు వేసి ఆపే ప్రయత్నం చేశారు. పైసా ఇవ్వని బీజేపీ నేతలు రూ.85 వేల కోట్లు ఇచ్చామని, చేయని పనికి గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీళ్లు ఇస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై రాళ్లు వేసే ప్రయత్నం చేసింది. రుణమాఫీ చేయడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తి చేశారు. కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే నెల రోజుల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశారు’ అని మంత్రి తెలిపారు.
కేసీఆర్ నమ్మకానికి మారుపేరైతే కాంగ్రెస్ నమ్మకానికి నయవంచనకు మారుపేరని అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఫెయిల్ అయిందని ఢిల్లీ.. గల్లీలో ఎక్కడా ఆ పార్టీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ఉన్న నాలుగు తోకలు తన్నుకుంటున్నరు అని అన్నారు. యువతకు ఉపాధి కోసం రూ.1,200 కోట్లతో సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో కోకాకోలా కంపెనీ ఏర్పాటవుతున్నదని, ఇదంతా కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమైందని తెలిపారు. బండమైలారం, తునికిబొల్లారంలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ‘బీజేపీకి బలంలేదు. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు. మన బీఆర్ఎస్కు తిరుగులేదు’ అని అన్నారు. ఎవరేమన్నా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టుడు ఖాయం.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.