హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్లు. కానీ ప్రభుత్వం శనివారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జాతర మొదలుపెట్టింది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒకేరోజు 9 ప్రాంతాల్లో నిర్మించిన 11,700 డబుల్ బెడ్రూం గృహాలను పేదలకు పంచటం రికార్డు. ఈ కార్యక్రమంతో విపక్షాల మైండ్‌బ్లాంక్ అయింది. రేపటి నుంచి ఆ రెండు పార్టీలకు ఎజెండానే కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పేదల కల సాకారం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి నిరుపేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా అందజేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచి ఇండ్ల నిర్మాణంలో నిమగ్నమైంది. ఇతర జిల్లాల్లో భూమిని సేకరించి ఇండ్లు నిర్మించడం సులువు. కానీ హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గృహ సముదాయాలకు స్థలాలు సేకరించడం చాలా కష్టం. లబ్ధిదారుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా స్థలాను ఎంపిక చేయాల్సి మరింత కష్టం. అంతటి క్లిష్టమైన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం సాఫీగా పూర్తి చేసింది. కరోనా ప్రభావం నిర్మాణ రంగంపైనా పడటంతో పనుల్లో జాప్యం సాధారణమైంది. ఈ సమస్యను కూడా అధిగమించి గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం దిగ్విజయంగా దాదాపు 75 వేల వరకు నిర్మాణాలను పూర్తి చేసింది. ఇందులో కొన్నింటిని గతంలోనే పంపిణీ చేసింది. ఇప్పుడు నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న 69,632 ఇండ్లను దశలవారీగా పంపిణీ చేస్తున్నది. శనివారం ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఒకేరోజు 11,700 గృహాలను లబ్ధిదారులకు అందించగా, మిగిలినవాటిని దశలవారీగా అందించనున్నారు.
ఎన్నికల వేళ విపక్షాలు కకావికలం
గత ప్రభుత్వాల మాదిరిగా రాజకీయాల కోసం అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లు కట్టి ఇష్టానుసారంగా పంచి పెట్టడం కాదు..నిరుపేదలు ఆత్మగౌరవంగా బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్లను పక్కాగా కట్టిస్తామని, ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా తొందరపడబోమని గతంలో సీఎం కేసీఆర్ పదేపదే చెప్పారు. చెప్పినట్టుగానే గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, మౌలిక వసతుల పరంగా మున్ముందు దశాబ్దాల పాటు ఇబ్బంది లేకుండా వీటి నిర్మా ణం జరుగుతున్నది. ప్రతిపక్షాలకు మాత్రం ఇవేవీ అర్థం కాలేదు. రాజకీయ కోణంలో మాత్రమే వీటిని చూడటంతో నిర్మాణం పూర్తయ్యేవరకు ఓపిక పట్టకుండా గాయిగాయి చేశాయి. లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నించాయి. ఎలాగూ తమకు ఎజెండా లేదు.. డబుల్ బెడ్రూం ఇండ్లయినా రెండు ఓట్లు రాల్చకపోతాయా? అని నిన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీ నాయకులు దింపుడుకల్లం ఆశతో ఉన్నారు. కానీ గ్రేటర్లో డబుల్ ఇండ్ల పండుగ మొదలుకావడంతో ఆ ఆశా చచ్చిపోయింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభ్యర్థులు కరువై దిక్కులు చూస్తున్న రెండు జాతీయ పార్టీలకు ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది.