మోత్కూరు, ఫిబ్రవరి 3 : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు సొంత పార్టీ నాయకులే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్రమ ఆస్తులు, సంపాదన లక్ష్యంగా, పదవు లు, పర్సంటేజీలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. సోమవారం అసమ్మతివాదులు మోత్కూరులోని ఓ ఫంక్ష న్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం, డీసీసీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, సూర్యాపేట డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందచార్యులు, మోత్కూరు మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ వల్లంభట్ల పూర్ణచందర్రావు, సీనియర్ నాయకులు నారగోని అంజయ్యగౌడ్ హాజరై మాట్లాడారు.
అవకాశం కోసం వచ్చిన సామేల్‌ను ఆదరించి పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కార్యకర్తలను ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కలుపుకొని పోకపోగా అక్రమ కేసులను పెట్టి పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశా రు. పనుల కోసం తన దగ్గరకు వెళ్లిన వారిని ‘నా మనిషివి కాదని, పలాన మంత్రి మనిషివి’ అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సామేల్ నాయకులందరినీ కలుపుకొని పోవాలని, లేకపోతే సహించేది లేదని, ప్రతి పర్యటనను అడ్డగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ కారుడిని అని చెప్పుకునే నైతిక హక్కు ఆయనకు లేదని శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ మండిపడ్డారు. పదేండ్లలో ఏనాడు అమరులను తలచి నివాళి అర్పించలేదని విమర్శించారు.