Kishan Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించేవాడని, కిషన్‌రెడ్డి రాకతో తమకు స్వేచ్ఛ దొరుకుతుందని భావించామని, కానీ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని పలువురు నేతలు వాపోతున్నారు. ‘రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులు తప్ప మిగతా వారెవరూ మీడియాతో మాట్లాడొద్దని, కనీసం మీడియా ప్రతినిధులను కలువొద్దు’ అని కట్టడి చేశారని మండిపడుతున్నారు. ఎవరైనా మీడియాతో మాట్లాడితే వారికి క్లాస్ పీకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురైదుగురే టీవీల్లో, పేపర్లలో కనిపిస్తూ, నేతలుగా చెలామణి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని మీడియా పాయింట్‌ను కూడా ఎత్తివేస్తుండటాన్ని ఆ పార్టీ తప్పుబడుతున్నారు.
‘ఉన్న వాళ్ల నోర్లు మూయడం కాదు.. పార్టీని విడిచిపెట్టి పోయేవాళ్లను ఆపండి’ అంటూ కొందరు నేతలకు చురకలు అంటిస్తున్నారు. అంబర్‌పేట సీనియర్ నేత వెంకటరెడ్డి పార్టీని వీడటాన్ని ప్రస్తావిస్తున్నారు. దశాబ్దాలుగా బీజేపీలో ఉంటూ, కిషన్‌రెడ్డికే శిక్షణ ఇచ్చిన, గురువుగా భావించిన వ్యక్తే పార్టీని వీడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ మాజీ ఎంపీ ఇంట్లో దాదాపు 10 మంది ముఖ్య నేతలు సమావేశమై కలిసికట్టుగా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు జరిపిన చర్చలను కూడా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ బృందంలోని కొందరు నేతలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగించడంతో వెనక్కి తగ్గారని సమాచారం. మిగతా నేతలు ‘తెల్ల ఏనుగుల’ లాంటివాళ్లని, బీజేపీలో ఉన్నా ప్రయోజనం లేదని, వెళ్లిపోయినా పెద్దగా నష్టం జరగదని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నిత్యం అసంతృప్తితో ఉండే ఆ నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్తే తమ నెత్తిన పాలుపోసినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.