Arogya Bhadratha | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): పోలీసు ఆరోగ్య భద్రత పథకంలో అందుతున్న వైద్య సేవల తీరుపై ఆశాఖలోని అధికారులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పోలీసు ఆరోగ్య భద్రతపైనే ఆధారపడకుండా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా చేయించుకుంటున్నారు. ప్రభుత్వ వైఖరిపై కానిస్టేబుల్ ఉంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఏమైనా అయితే ఎవరు దిక్కు?
ఆరోగ్య భద్రతపై పోలీసుశాఖలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. కొందరైతే తమ వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వంపై నేరుగా అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఎందుకైనా మంచిది.. మీరు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అందరూ మనకు భద్రత ఉందనుకుంటున్నారు. కానీ.. భద్రతకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్నిరకాల ఆపరేషన్లకు ఆరోగ్యభద్రతకార్డు ద్వారా లక్ష రూపాయలు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చయితే.. మిగిలిన రూ.4 లక్షలు మనమే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే.. మొత్తం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుంది. వెంటనే అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వీలైతే టర్మ్ పాలసీ కూడా చేయించుకోండి. కోటి రూపాయల వరకు వస్తాయి అని ఓ అధికారి వాట్సాప్ గ్రూపులో చెప్పారు. ఇప్పుడు ఈ మెస్సేజ్ పోలీసుశాఖలోని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది.
గాలితో దీపంలా మారింది
నిరుడు అక్టోబర్‌లో గుండెపోటు వచ్చిన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవర్’లో ఓ ప్రముఖ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు వైద్యులు నిరాకరించారు. మరో రెండు హాస్పిటళ్లకు తరలించినా పోలీసు ఆరోగ్య భద్రతా?.. దాంతో వైద్యం చేయలేం అని మొహం మీదనే చెప్పడంతో అప్పటికే సమయం మించిపోయి అతను చనిపోయాడు. ప్రభు త్వ ఆరోగ్యభధ్రత కార్డుతో భద్రత నామమాత్రమేనని గుర్తిం చి.. అప్పట్నుంచీ పోలీసులు అసంతృప్తిగా ఉన్నారు. తమ జీతం నుంచి నెలనెలా మెడికల్ విభాగంలో డబ్బులు కట్ చేస్తున్న ప్రభుత్వం.. తమ కోసం ఖర్చు చేసేందుకు మాత్రం వెనుకాడడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తమ ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని వాపోతున్నారు.