హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ(డీఎస్సీ)లో ఇంకా వివాదాలు వెంటాడుతున్నాయి. అనర్హులకు ఉద్యోగాలు, స్పె షల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ అంశం ఇప్పటికే వివాదాస్పదం కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐవోఎస్) డిప్లొ మా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తాజాగా ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రేవంత్ సర్కార్ పెడచెవిన పెట్టడంతో సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తంచేసింది. బుధవారం అధికారుల వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
దీంతో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, అదనపు డైరెక్టర్ లింగయ్య, 8మంది డీఈవోలు మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. 2024 అక్టోబర్లో డీఎస్సీ ఫలితాలు విడుదల కాగా, దాదాపు 10వేల పోస్టులు భర్తీచేశారు. ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. అయితే ఎన్ఐవోఎస్ ద్వారా కొందరు అభ్యర్థులు డీఈఎల్ఈడీ కోర్సు పూర్తిచేశారు. మన దగ్గర రెండేండ్ల కోర్సు పూర్తిచేసిన వారినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, ఎన్ఐవోఎస్ 18నెలల వ్యవధి గల కోర్సును నిర్వహిస్తున్నది. అ యితే వీరిని పరిగణనలోకి తీసుకోకపో వడంతో సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి సహా మరో నాలుగు జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.