BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘మనలో ఎవరో ఒక కోవర్ట్ ఉన్నారు’.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మెదులుతున్న సందేహం ఇది. ఆ కోవర్టు ఫలానా వ్యక్తే కావొ చ్చని అనుమానిస్తున్నారు. బీజేపీలో ఇటీవల గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి వర్గం, ఈటల వర్గం, కిషన్‌రెడ్డి వర్గం ఉండేవి. కిషన్‌రెడ్డి అధ్యక్షుడైన తర్వాత ఈటల వర్గం సైలెంట్ అయిపోయిందని, అంతా సద్దుమణిగిందని భావించారు. వీరి మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయనేది ప్రస్తుత టాక్.
ఇటీవల బీజేపీ నిర్వహించిన 24 గంటల దీక్షకు రాష్ట్ర నేతలంతా హాజరుకాగా ఈటల దూరం గా ఉన్నారు. మరోవైపు బండి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రస్థాయి లో, రాష్ట్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన అనుచరులకు కిషన్‌రెడ్డి చెక్ పెట్టారు. దీంతో వారు కిషన్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. బీజేపీలో భవిష్యత్తు లేదని అర్థమైన కొందరు సీనియర్లు బయటికి వెళ్లిపోయేందుకు సిద్ధమై మరో గ్రూప్‌గా ఏర్పడ్డారు.
సమాచారం బయటికి ఎలా వెళ్తున్నది?
ఆయా వర్గాల నేతలు రహస్య సమావేశాల్లో జరిగిన చర్చలు, నిర్ణయాల వివరాలు వెంటనే మరో వర్గానికి తెలిసిపోతుండటం, మీడియాకు సైతం లీకవుతుండటం వారిని కలవర పెడుతున్నది. ఇటీవల దాదాపు పది మంది అసంతృప్త నేతలు ఒక మాజీ ఎంపీ నివాసంలో రహస్యంగా భేటీ అయిన విషయం ఈటలకు తెలిసిందని, తన మనిషి అనుకున్న వ్యక్తి సైతం అందులో ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
దీంతో మరుసటిరోజే ఆ నేత ఈటల ఇంటికి వెళ్లి సంజాయిషీ ఇచ్చుకున్నారట. తాజాగా విజయశాంతి నివాసంలో సమావేశమైన కొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర నాయకత్వానికి సమాచారం వెళ్లిపోయింది. దీంతో ఒకరిద్దరు నేతలు హుటాహుటిన రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తమ గ్రూపులో ఒకరు కోవర్టుగా పనిచేస్తున్నారని అసంతృప్త నేతలు అనుమానిస్తున్నారు. ఈటల వర్గం, కిషన్‌రెడ్డి వర్గం నిర్వహించే రహస్య సమావేశాల వివరాలు కూడా బహిర్గతం అవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. తమ గ్రూపులోకి కోవర్టులను ప్రవేశపెట్టారంటూ ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నారు.