హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని జీఆర్ఎంబీ నిర్ణయించింది. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనవరి 24న బోర్డుకు లేఖ రాశారు. అంతకుముందు జనవరి 4న ఈఎన్సీ జనరల్ కూడా బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు లేఖల ఆధారంగా ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా జనవరి 9న బోర్డు ఆదేశించినా, ఇప్పటివరకు ఏపీ నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై బోర్డులో చర్చించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకూ సమావేశంపై బోర్డు సమాచారమిచ్చింది. మీటింగ్‌లో చర్చించే అంశాలనూ పంపింది.
బోర్డు మీటింగ్‌లో రెండు రాష్ర్టాలకు చెందిన 15 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై చర్చించనున్నారు. అందులో నాలుగు ఏపీకి సంబంధించినవి కాగా, మిగతా 11 ప్రాజెక్టులు తెలంగాణవే. తెలంగాణ చేపట్టిన 11 ప్రాజెక్టులకు అనుమతులు లభించలేదని ఎజెండా అంశాల్లో బోర్డు పేరొన్నది. 9 ప్రాజెక్టులకు సంబంధించి 8 డీపీఆర్‌లకు సీడబ్ల్యూసీ అప్రైజల్ కమిటీ ఆమోదం తెలిపినట్టు స్పష్టంచేసింది. అందులో రెండు ప్రాజెక్టులకు ఒకే కామన్ డీపీఆర్ ఉన్నదని వెల్లడించింది. అయితే, మిగతా రెండు ప్రాజెక్టులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర జల్‌శక్తి శాఖను తెలంగాణ కోరిందని, దీంతో చనాకా-కొరాట బ్యారేజీ డీపీఆర్‌కూ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని పేరొన్నది. ఏపీకి సంబంధించిన ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదని పేర్కొన్నది. అయితే, వెంకటనగరం పంపింగ్ సీం, బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సీంల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ వెనక్కి పంపించిందని తెలిపింది. ఏపీ మరోసారి డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
2021 జులై 15న కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న 16 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని జీఆర్ఎంబీ చెప్తున్నది. దానికి సంబంధించి 2021 జూలై 29న కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని, దానిని అదే ఏడాది సెప్టెంబర్ 13న సబ్ కమిటీగా మార్చామని స్పష్టంచేసింది. బోర్డుకు అప్పగించాలని చెప్తున్న ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి బోర్డు అధికారులు పరిశీలించారని పేర్కొన్నది. అయితే, పెద్దవాగు ఒకటే ఉమ్మడి ప్రాజెక్ట్ అని, దానిని తప్ప మిగతా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ అధికారులు బోర్డుకు స్పష్టంచేశారు. ఏపీ మాత్రం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. పెద్దవాగు ఆధునికీకరణపై ఏపీ తిరకాసు పెడుతుండటంతో దానిపైనా జీఆర్ఎంబీ సమావేశంలో చర్చించనున్నారు.
జీఆర్ఎంబీలో ప్రాజెక్టులను ప్రత్యేకంగా మానిటరింగ్ చేసేందుకు జీఐఎస్ హైడ్రాలజీ సెల్‌ను ఏర్పాటుచేయాలని బోర్డు భావిస్తున్నది. ప్రాజెక్టుల పూర్తి సమాచారం, వాటి భద్రతను జీఐఎస్ ద్వారా విశ్లేషించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఏడు అంశాల వారీగా ప్రాజెక్టులను జీఐఎస్‌తో పర్యవేక్షణ చేపట్టనున్నది. దీనిపై కూడా బోర్డు మీటింగ్‌లో చర్చించనున్నారు. బోర్డు బడ్జెట్, కొత్త పోస్టుల క్రియేషన్ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.