CM Revanth Reddy | రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చకు పెట్టనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 2న కుల గణన నివేదిక రాబోతుందన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ సైతం నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ఈ రెండు అంశాలపై శాసనసభలో చర్చిస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలను సమగ్రంగా వివరించారు. వందేళ్ల నాడు బ్రిటిషర్ల కాలంలో జరిగిన కులగణన ఆ తర్వాత జరగలేదని అన్నారు. ఎంత మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినా వెనుకబడిన తరగతుల వారి లెక్కలు తేల్చలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి బీసీల లెక్కలు తేల్చిందని పేర్కొన్నారు.