రవీంద్రభారతి, డిసెంబర్ 29: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనైనా నిరుద్యోగ అంశంపై చర్చ జరగాలని, జాబ్ నోటిఫికేషన్‌పై వెంటనే ప్రకటన ఇవ్వాలని నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ అంశంపై చర్చ కోసం ప్రతిపక్షాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా కనీసం రెం డు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మ్యానిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస పార్టీ.. రెండు ఏండ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూ డా ఇవ్వలేదని, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పూర్తయి, ఫలితాలు ఇచ్చిన తర్వాత కేవలం నియామక ప్రతాలే ఇచ్చి 60 వేల ఉద్యోగాలను తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రగల్భాల రెడ్డే తప్ప పనిచేసే రెడ్డికాదని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ర్టాన్ని దిగజార్చారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని, లేకుంటే సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రికి చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కొడంగల్ రవి, ఇంద్రానాయక్, కయ్యా వెంకటేశ్, శంకర్‌నాయక్, సింధూరెడ్డి పాల్గొన్నారు.