హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : వారంతా రెగ్యులర్ ఉద్యోగులు.. పైగా ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా లభించాల్సిన ప్రయోజనాలేవి వారికి అందవు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే డెత్ గ్రాట్యుటీ అందుతుంది. సీపీఎస్ ఉద్యోగులు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. కానీ ఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ అందదు. ఫ్యామిలీ పెన్షన్ వర్తించదు. ఇంతటి వివక్షను రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి. వీటిల్లో దాదాపు 3వేలకు పైగా టీచర్లు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) పరిధిలోనే ఉన్నారు. సీపీఎస్ కోసం ప్రతి నెలా వీరి వేతనాల నుంచి 10% కోత విధిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం సైతం 10% వాటాను మ్యాచింగ్ గ్రాంట్‌గా అందజేస్తున్నది. ఇప్పటి వరకు 40 మంది మాడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వాస్తవానికి సీపీఎస్ ఉద్యోగులు మరణిస్తే డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. కానీ ఇంతవరకు వీటిని ప్రభుత్వం అందించలేదు. దీంతో బాధిత కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నాయి. ఇటీవల నలుగురు టీచర్లు పదవీ విరమణ పొందారు. వీరికి రూపాయి కూడా గ్రాట్యుటీ కింద రాలేదు. సీపీఎస్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలపై ప్రభుత్వం గతంలోనే జీవోలు జారీచేసింది. జీవో-60 ప్రకారం సీపీఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యుటీ చెల్లించాలి. జీవో-58 ప్రకారం ఉద్యోగి మరణిస్తే, బాధిత కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరుచేయాల్సి ఉంది. ఈ రెండు జీవోలను మాడల్ స్కూల్ టీచర్లకు అమలు చేయడంలేదు. దీంతో టీచర్లంతా పనిచేస్తున్నందుకు వేతనం మాత్రమే పొందుతున్నారు. మిగతా ప్రయోజనాలకు దూరమయ్యారు. చనిపోతే కారుణ్య నియామకాల కోటాలో ఉద్యోగాలు కూడా ఇవ్వడంలేదు.
మాడల్ స్కూల్ టీచర్లమంతా రెగ్యులర్ టీచర్లమే. మాకు అందరిలాగే సీపీఎస్ అమలు చేస్తున్నారు. ప్రతి నెలా జీతం నుంచి కోత విధిస్తున్నారు. కానీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను మాడల్ స్కూల్ టీచర్లకు అమలు చేయకపోవడం అన్యా యం. ప్రభుత్వ ఉత్తర్వులను సర్కారే అమలుచేయకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి.
– భూతం యాకమల్లు, తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు