హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖలో కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. మూడేండ్లుగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఏఎంఐవీఐ) ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నా.. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నేటికీ సమావేశం కావడం లేదు. దీంతో రవాణాశాఖలో ప్రమోషన్లులేక ఎంవీఐ, ఏఎంవీఐలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీఏలకు డీటీసీలుగా, డీటీసీలకు జేటీసీలుగా పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం.. ఎంవీఐలకు ఆర్టీఏలుగా, ఏఎంవీఐలకు ఎంవీఐలుగా ప్రమోషన్ ఇప్పించడంలో తాత్సారం చేస్తున్నదని మండిపడుతున్నారు.
రవాణాశాఖలోని పలువురు ఉన్నతాధికారులకు పదోన్నతులు కల్పించి.. కిందిస్థాయిలో పనిచేసే తమవరకూ వచ్చేసరికి ఏవేవో కారణాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎంవీఐలకు ప్రమోషన్లు కల్పించకపోవడంతో 20 వరకు ఆర్టీఏ పోస్టులు ఖాళీగానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఆగస్టులో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా.. నేటికీ అతీగతి లేదని మండిపడుతున్నారు. ఈ ఏడాది కూడా తమకు ప్రమోషన్లు రావనే ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నారు. పదోన్నతులు కల్పిస్తే.. రవాణాశాఖపై ఎలాంటి ఆర్థిక భారం పడకపోయినా కూడా ప్రమోషన్లు కల్పించకపోవడం దారుణమని వాపోతున్నారు.