హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): పీఎం కుసుమ్ పథకం కింద పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు డిస్కం అధికారులు కొర్రీలు పెడుతున్నారు. సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నాక సబ్ స్టేషన్‌కు డెడికేటెడ్ 11కేవీ విద్యుత్తు లైన్ ఏర్పాటు విషయంలో కొత్తWW నిబంధనలను తెరపైకి తెచ్చి అమాయక రైతులతో ఆటాడుకుంటున్నారు. గతంలో ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి 11కేవీ లైన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఈ నిబంధనకు ఒప్పుకోమని, ఒక్కో రైతు సొంతగా 11కేవీ లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలని, అలా అయితేనే అనుమతులిస్తామని చెప్తున్నారు. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందు ఒకటి చెప్పి ఇప్పుడు కొత్త నిబంధన పెట్టడం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
పీఎం కుసుమ్ స్కీం కింద 1,450 మెగావాట్ల ప్లాంట్లకు 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,070 మోగావాట్లకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) కుదిరాయి. 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న స్థలాల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. ఆ ప్లాంట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్తును సబ్‌స్టేషన్‌తో అనుసంధానించేందుకు 11కేవీ లైన్న్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. ఈ లైన్ ఏర్పాటుకే దాదాపు రూ.70 లక్షలు ఖర్చవుతుందని, దీన్ని ఒక్కరే భరించడం కష్టమని రైతులు చెప్తున్నారు. అదే ఇద్దరు, ముగ్గురు కలిసి విద్యుత్తు లైన్ వేసుకుంటే ఆర్థిక భారం తగ్గుతుందని అంటున్నారు. కానీ, డిస్కం అధికారులు మాత్రం ప్రతి రైతు ప్రత్యేకంగా 11కేవీ లైన్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పీపీఏలు కుదిరాక ఇలా కొర్రీలు పెట్టడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పీఎం కుసుమ్ స్కీం లాభదాయకంగా లేకపోవడం, డిస్కం అధికారులు రోజుకో కొత్త నిబంధన విధిస్తుండటంతో పలువురు రైతులు ఈ పథకం నుంచి వైదొలగాలని యోచిస్తున్నారు. సోలార్ మాడ్యూళ్ల ధరలు 25% మేరకు పెరగడంతో ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.7 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తున్నదని, ప్లాంట్ ఏర్పాటు తర్వాత సబ్‌స్టేషన్ వరకు 11కేవీ విద్యుత్తు లైన్ ఏర్పాటుకు భారీగా ఖర్చవుతున్నదని రైతులు చెప్తున్నారు. అప్పులు తెచ్చి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తమకు ఒక్కో యూనిట్ విద్యుత్తుపై కనీసం 90 పైసలు కూడా మిగిలే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అప్పులు, వడ్డీలు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.