వరంగల్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. స్తూపాలకు రంగుమారడం మేడారంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్‌కు ఎదురుగా)లో ఉన్న ఒక స్తూపం ఉన్నట్టుండి ఆకుపచ్చని రంగులోకి మారిపోయింది. ‘మంత్రి సీతక్క ఇలాకాలో ఇలా జరగటం ఏమిటి?’ అనే ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. తాను విప్లవోద్యమం నుంచి వచ్చానని, ఆదివాసీ బిడ్డనని సందర్భం వచ్చిన ప్రతిసారి గర్వంగా ప్రకటించుకునే మంత్రి సీతక్క తన నియోజకవర్గంలోని స్తూపానికి ఇలా రంగు వేస్తుంటే చూస్తూ ఊరుకోవటంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడారంలో మంత్రి సీతక్కకు తెలియకుండా చీమకూడా చిటుక్కుమనదనేలా వాతావరణం మారిపోయిన ఈ తరుణంలో ఇలా స్తూపం రంగుమార్చుకోవడం ఆసక్తిని కలిగిస్తున్నది.
మేడారంలో స్తూపాలు
ప్రస్తుతం ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్గేట్కు ఎదురుగా)లో ఉన్న ఈ రంగుమారిన స్తూపాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల సందర్భంగా దీన్ని నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం నుంచి 2010 వరకు మేడారం జాతర ప్రాంగణాల్లో రాత్రికి రాత్రే తాత్కాలిక స్తూపాలు మొలుచుకురావడం, వాటిని కూల్చడం సర్వసాధారణ అంశమేనని పేరు చెప్పటానికి నిరాకరించిన ఓ రిటైర్డ్ పోలీసు కానిస్టేబుల్ పేర్కొనడం గమనార్హం.