హైదరాబాద్ : మానవతా కోణంలో ఆలోచించి వికలాంగుల సంక్షేమం కోసం కోట్ల నిధులు ఖర్చు చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ బడ్జెట్ రూ. 20 కోట్ల నుంచి రూ. 83 కోట్లకు పెంచారని తెలిపారు. ఈ 4 న మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు హైదరాబాద్ మలక్పేట వికలాంగుల సంక్షేమ భవన్లోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వికలాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్ రావుతో పాలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
అనంతరం వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూ. 500 ఉన్న పెన్షన్ను రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చాక రూ. 1500, రెండోసారి ప్రభుత్వం వచ్చాక రూ. 3016లకు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 5 లక్షల 51 వేల మంది వికలాంగులకు సంవత్సరానికి రూ. 2000 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఉమ్మడి పాలనలో 30 శాతం సబ్సిడీతో మాత్రమే సహాయ ఉపకరణాలు అందేవని ఇప్పుడు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అనేక సహాయ ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు. 2014 నుండి నేటి వరకు రూ.36 కోట్ల విలువ గల సహాయ ఉపకరణాలను 40,845 లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు.
ఉమ్మడి ఏపీలో బదిరులకు చెవి మిషన్లు, ఎంపీ3 ప్లేయర్స్ మాత్రమే పంపిణీ చేసేవారని, మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు వారికి వీడియో కాల్స్ చేసుకునే విధంగా 4జీ స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యలో 4 శాతం, ఉద్యోగాల్లో 5 శాతం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 5 శాతం రిజర్వేషన్లను వికలాంగులకు కేటాయిస్తున్నారని తెలిపారు. తనకు మూడో సారి పదవి రావడానికి సహకరించి వికలాంగులకు సేవ చేసే భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు వాసుదేవరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.