హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంపు చేపట్టాల్సిందేననే డిమాండ్‌తో దివ్యాంగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నేటి నుంచి ఆందోళనలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో సామూహిక నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు పెంచుతామన్న కాంగ్రెస్.. గెలిచిన తర్వాత కనీస చర్యలు చేపట్టలేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రతినెలా రూ.6000 చొప్పున పింఛన్ అందజేయాల్సిందేనని తేల్చిచెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 44.70 లక్షల మందికి, సుమారు రూ.1000 కోట్ల పింఛన్‌గా ఖాతాల్లో జమచేసేవారు. కానీ కాంగ్రెస్ సర్కారు పింఛన్ నగదు పెంచకపోగా లబ్ధిదారుల్లో కోతపెట్టిందని మండిపడుతున్నారు. 21 నెలల్లో 1.92 లక్షల మందిని జాబితా నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇచ్చిన వినతిపత్రాలు బుట్టదాఖలయ్యాయని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఖజనాలో నిధుల్లేవని సాకులు చెప్తూ తప్పించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓపిక నశించడం వల్లే ఆందోళనకు సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడుతామని, ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.