హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిరణ్, వరంగల్ పట్టణానికి చెందిన తన స్నేహితుడి అవసరం కోసం రూ.60 వేలు చేబదులుగా ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో వరంగల్ పోలీసు కమిషరేట్‌లోని ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు కాకుండా, కిరణ్ స్నేహితుడిని పిలిచి స్టేషన్లోనే డబ్బులిచ్చేలా సెటిల్ చేసిన పోలీసులు.. తెల్లకాగితంపై సంతకాలు చేయించి, దాని సంగతి మర్చిపోయారు. ఇదే విషయమై కేసు పెట్టమని కిరణ్ వెళ్లి అడిగినా, నిందితుడికి కాల్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. ఆ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. అడిగితే ఎవరి దగ్గరా సమాధానం రాదు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): పోలీసుల్లో జవాబుదారీతనం కొరవడుతున్నది. అతి తక్కువ స్టేషన్లు మినహా ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా బాధితులకు సిబ్బంది నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. కారణం కిందిస్థాయి పోలీసులపై పైస్థాయి అధికారుల అజమాయిషీ లేకపోవడమే. ఏ స్టేషన్లో ఎవరెవరు, ఎప్పుడు డ్యూటీలకు వస్తున్నారు? వాళ్లు ఆ రోజు చేసిన డ్యూటీ ఏమిటి? అనే విషయాలపై పట్టు సన్నగిల్లుతుండటంతో జవాబుదారీతనం కొరవడింది.
ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై పూర్థిస్థాయిలో నమ్మకం కలిగేలా, పోలీసులు సైతం అంకితభావం, జవాబుదారితనం కలిగి ఉండేలా క్షేత్రస్థాయిలో పోలీసు నాయకత్వం బలపడేలా గత ప్రభుత్వం ఫంక్షనల్ వర్టికల్స్‌పై దృష్టిపెట్టింది. నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి తీసుకొచ్చిన 17 ఫంక్షనల్ వర్టికల్స్‌తో పోలీసుశాఖలో జవాబుదారీతనం ఉండేది. ఆ ఒరవడిని డీజీపీగా చేసిన అంజనీకుమార్ కొనసాగించారు. తద్వారా ప్రతి పోలీస్ ఉద్యోగికి తాను నిర్వర్తించాల్సిన పాత్ర, విధుల పట్ల అంకితభావం పెంపొందింది.
తెలంగాణలో శాంతిభద్రతలే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ ఉన్నతంగా పనిచేయాలనే ఉద్దేశంతో గతంలో డీజీపీలుగా చేసిన అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్.. ప్రతినెలా ఉన్నతస్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ప్రతినెలా నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్‌పై సమీక్షలు చేసేవారు. ఎక్కడ క్రైమ్ రేట్ పెరుగుతున్నది? ఆ ప్రాంత పరిస్థితులేమిటి? ఆ నేరంలో కొత్త విధానం ఏమిటి? అని ఆరా తీసేశారు. ఏ స్టేషన్లో సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నారు? ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అందుకు కారణాలేమిటి? ఫంక్షనల్ వర్టికల్స్‌ను అమలు చేస్తున్నారా? లేదా? అని డీజీపీ ఆరా తీసేవారు. లోపాల గురించి నేరుగా ఆయా కమిషనరేట్ల సీపీలు, ఎస్పీలతో మాట్లాడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పది నెలల్లోనే ఇద్దరు డీజీపీలు వచ్చినా, మంత్లీ క్రైమ్ రివ్యూలు, ఫంక్షనల్ వర్టికల్స్‌పై సమీక్షలు కొరవడ్డాయి.
రాష్ట్ర పౌరులందరూ ఆశించిన స్థాయిలో పోలీసు సేవలందించేందుకు, యావత్ పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా తమ ప్రతిభను పెంపొందిచుకునేందుకు 2018లో నాటి డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఫంక్షనల్ వర్టికల్స్ వ్యవస్థను రూపొందించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లోని పని విభాగాలను 17 ఫంక్షనల్ వర్టికల్స్‌గా విభజించారు. వాటి ఆధారంగా పోలీసులకు పని విభజన చేస్తారు. సిబ్బంది చేస్తున్న ఆయా పనులను విశ్లేషించి, వాటిని గణాంకాల్లోకి మార్చి, గ్రేడింగ్ ఇస్తుంటారు. తద్వారా పోలీస్‌స్టేషన్ స్థాయిలోనే విధుల నిర్వహణలో సమగ్ర, సహేతుకమైన మార్పు తీసుకురావడానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వీటిని సమర్థంగా అమలుచేసింది.
ఫంక్షనల్ వర్టికల్స్ ద్వారా వివిధ అధికారుల వ్యక్తిగత పనితీరు, సామర్థ్యాలను గుర్తించడంతోపాటు పారదర్శకంగా గ్రేడింగ్ ఇచ్చి, ఎక్కువ మార్కులు సాధించిన ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించేవారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అందరికీ ఫంక్షనల్ వర్టికల్స్ వ్యవస్థలో తమ స్థానం ఎంత? ఎక్కడుంది? అనే విషయాలు తెలుస్తాయి. ప్రతి ఫంక్షనల్ వర్టికల్ అధికారి సామర్థ్యాన్ని ‘కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్’గా గుర్తిస్తారు. ఫంక్షనల్ వర్టికల్ అధికారి పని తీరును లెకించడానికి సంబంధిత కేపీఐఎస్ డాటాను, విధి నిర్వహణలో ఉపయోగించే టీజీ కాప్, సీసీటీఎన్ఎస్, టెక్ డాటమ్, ఈ-పెట్టీ కేస్ వెబ్సైట్, ఈ-చలాన్ వెబ్సైట్, సీజీజీ, ఎస్సీఆర్బీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి యాప్‌లను తీసుకొని ప్రాధాన్యతల ఆధారంగా వెయిటేజీ ఇస్తూ, రివ్యూలు చేస్తూ, వారి పనితీరును అంచనా వేస్తారు. ఈ కార్యాచరణను నిరంతరం అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో డీజీపీ ఆఫీస్‌లోనే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను, జిల్లాస్థాయిలో ఎఫ్సీసీలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మారుమూల మండల పోలీస్‌స్టేషన్‌లోని కానిస్టేబల్ స్థాయి నుంచి.. హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే ఉన్నతస్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్క పోలీస్ పనితనం ప్రతిరోజూ అప్‌గ్రేడ్ అవుతుండేది. ఉత్సాహంగా పనిచేసే సిబ్బందికి ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు ఇచ్చి డీజీపీ ప్రోత్సహించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఉన్నతాధికారుల దృష్టికి రావడం లేదు.