యాచారం, ఆగస్టు 24 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు అధికారులు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమిని సేకరించారనే కోణంలో గత నెల 31 నుంచి అధికారులు సర్వే ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే మేడిపల్లిలో సర్వే పూర్తికావడంతో శుక్రవారం నానక్‌నగర్ భూముల్లో సర్వే ప్రారంభించారు. మరో అధికారుల బృందం కందుకూరు మండలంలోని సార్లరావులపల్లి, ముచ్చర్ల, మీర్ఖాన్పేట శివారులో సర్వే కొనసాగిస్తున్నారు. గతంలో యాచారం మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్దలో 11,000ల ఎకరాల భూములను సేకరించారు. ఇందులో 2,500ల ఎకరాలకు చెందిన పట్టా భూములను రైతులు ఫార్మాకు ఇవ్వలేదు. ఫార్మాకు ఇవ్వని, వివాదాస్పద భూములు మినహాయించి మిగతా భూములకు ఇప్పటికే అధికారులు పోలీసుల సాయంతో ఫెన్సింగ్ వేశారు.
ఫార్మాకోసం సేకరించిన భూములకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఆర్ఐ మురళీకృష్ణ, టీజీఐఐసీ అధికారులు, సర్వేయర్లు డిజిటల్ సర్వేలో పాల్గొంటున్నారు. భూముల సరిహద్దులను సులభంగా కొలవడానికి వీలుగా హద్దులు గుర్తిస్తున్నారు. హద్దుల గుర్తింపు పక్రియను వేగంగా చేపడుతున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పీబీఎం నంబర్లు వేస్తున్నారు. ఆ దిమ్మెల పైభాగంలో డిజిటల్ చిప్ అమర్చుతున్నారు. దీనిని నేరుగా ఉపగ్రహానికి ట్యాగ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇకపై సర్వేయర్లు, అధికారులు, పరిశ్రమల యాజమానులు పదేపదే సర్వే చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేయగా, టీజీఐఐసీ అధికారులు హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
పరిశ్రమలకు అప్పగించేందుకే ఫార్మా భూములకు ప్రభుత్వం జోరుగా సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. 500, 1000, 1500, 2000, 2500, 3000 ఆపై ఎకరాలను బ్లాకులుగా విభజిస్తూ సర్వే చేస్తున్నారు. ఒక కంపెనీకి 1000 ఎకరాల స్థలం అవసరముంటే శాట్‌లైట్ సర్వే చేసుకొని ఆ భూమి కొనుగోలు చేస్తారు. ఇప్పటికే జర్మనీ కంపెనీకి సుమారు 1000ఎకరాలు అప్పగించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటి డిమాండ్ చేస్తున్నది.