హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయంలో నిలదొకుకునేందుకు డిజిటల్, సాంకేతిక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమాజిగూడలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన అగ్రివిజన్-2025లో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాన్ని బలోపేతం చేస్తేనే భవిష్యత్తులో పర్యావరణ మార్పులను దీటుగా ఎదుర్కోగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. వ్యవసాయంలో సుస్థిరత, ఉత్పాదకత పెంపునకు టెక్నాలజీ ఆధారిత అనువర్తనాలను వాడుకోవాలని సూచించారు. పంటల వైవిధ్యం పాటించాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలిపారు. ఉద్యాన పంటల్లో కోత అనంతరం నష్టాల తగ్గింపునకు డిజిటల్ అప్లికేషన్స్ అవసరమని చెప్పారు. ఆ దిశగా పరిశోధనలు ముమ్మరం చేయాలని సూచించారు.
ఎరువుల సరఫరాకు ఒకే టెండర్
హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ఎరువుల స్టోరేజీ, రవాణాకు సంబంధించి టెండర్లు పిలువగా ఒకే ఒక టెండర్ దాఖలైనట్లుగా తెలిసింది. దీంతో దానిని రద్దు చేస్తూ మార్క్‌ఫెడ్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. రెండేళ్లకు(2025-26, 2026-27) సంబంధించి రైతులకు ఎరువులు అందించేందుకుగానూ వా టి నిల్వ, క్షేత్రస్థాయిలోకి రవాణాకు 22రేక్ పాయింట్లకు(రైలు నుంచి ఎరువులు తీసుకునే పాయింట్స్)మార్క్‌ఫెడ్ టెండర్లు పిలిచింది. ఇందులో భా గంగానే మంగళవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా.. రెండు రేక్ పాయింట్లకు ఒక్క సంస్థ కూడా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదని, మిగిలిన 20 రేక్ పాయింట్లకు కలిపి ప్రస్తుతం కొనసాగుతన్న ఒకే సంస్థ టెండర్ దాఖలు చేసినట్టుగా తెలిసింది. టెండర్లకు సంబంధించి తొలుత నిబంధనలు కఠినంగా పెట్టిన అధికారులు, ఆ తర్వాత కమిటీ సూచన, సంస్థల అభ్యర్థనతో సడలించింది. అయినప్పటికీ టెండర్లు వేసేందుకు సంస్థలు ముం దుకు రాకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఒకే టెండర్ దాఖలైతే దానిని రద్దు చేయాల్సి ఉండడంతో దానిని రద్దు చేసి మరోసారి టెండర్‌కు వెళ్లాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించినట్టుగా తెలిసింది.