Crop Survey | హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల సాగు నమోదును మరింత కచ్చితంగా లెక్కించేందుకు కొత్త విధానం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే ‘డిజిటల్ క్రాప్ సర్వే’ను చేయనున్నది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు అమలు చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 16 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ క్రాప్ సర్వేను అమలు చేసింది.
ఈ వానకాలం సీజన్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో డిజిటల్ సర్వేను అమలు చేయాలా లేక పాత పద్ధతిలోనే చేయాలా అనే అంశంపై వ్యవసాయ శాఖ చర్చిస్తున్నది. వీలైతే వచ్చే ఏడాది నుంచి అమలుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తున్నది. కేంద్రం అనుమతిస్తే డిజిటల్ క్రాప్ సర్వే వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది లేనిపక్షంలో ఈ సీజన్ నుంచి అమల్లోకి రానున్నది.
ప్రతి రైతు, ప్రతి పంట ఫొటో…
పంట సాగు విస్తీర్ణం లెక్కింపులో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం, డిజిటల్ క్రాప్ సర్వే దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. డిజిటల్ క్రాప్ సర్వేలో అదనంగా పంట ఫొటోలు, రైతు ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. తద్వారా ఏ రైతు ఏ పంట వేశారనేది ఆధారాలతో ఉంటుందనేది అధికారుల అభిప్రాయం. కేంద్రం ఆదేశాలతో డిజిటల్ క్రాప్ సర్వేను ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌వంటి రాష్ర్టాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ర్టాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నాయి. ఈ డిజిటల్ క్రాప్ సర్వే అమలుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం అందించనున్నది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో…
పంట సర్వే కోసం కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విధానం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచింది. టెక్నాలజీ సాయంతో పంట సర్వే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పంట సర్వేను మాన్యువల్‌గా చేసేవాళ్లు. ఈ విధానానికి స్వస్తి చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఆన్లైన్ చేసింది. ఆ తర్వాత మరింత మెరుగ్గా నిర్వహణకుగానూ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో ఫలనా సర్వే నెంబర్లో పంట సాగును నమోదు చేయాలంటే కచ్చితంగా ఆ అధికారి ఆ సర్వే నంబర్లో ఉండాల్సిందే. ఆ సర్వే నంబర్‌కు 50-100 మీటర్ల విస్తీర్ణంలో ఉంటేనే ఆ వివరాలు యాప్‌లో నమోదవుతాయి. దీంతో పంట సాగు విస్తీర్ణం కచ్చితత్వంతో నమోదయ్యేది.