హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : నేటి సాంకేతిక యుగంలో ‘డిజిటల్ అడిక్షన్’ పెను ముప్పుగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నలుగురితో కలువడం తగ్గిపోయి కుటుంబ, స్నేహ బంధాలు బలహీనమవుతున్నాయి. చిన్నారుల్లో ‘డిజిటల్ అడిక్షన్’ విపరీతంగా పెరగడంపై కేంద్ర ఆర్థిక సర్వే-2025-26 తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యసనం వల్ల విద్యార్థుల్లో అకడమిక్ పెర్ఫార్మెన్స్, ఉద్యోగుల్లో వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతున్నదని, యువతలో మానసిక ఆరోగ్యం తీవ్రంగాదెబ్బతింటున్నదని పేర్కొన్నది. ముఖ్యంగా 15-24 మధ్య వయస్కుల్లో సోషల్ మీడియా వినియోగం ఆందోళనకర స్థాయికి చేరినట్టు తెలిపింది. మన దేశయువతలో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ డిజార్డర్లు పెరుగుతున్నట్టు స్పష్టం చేసింది. వీటి వల్ల నిద్రలేమి, కోపం, సామాజిక బంధాలకు దూరంగా ఉండాలనే భావన అధికమై డిప్రెషన్‌కు లోనవుతున్నట్టు వివరించింది. ‘టెలీ మానస్’కు ఏడాది కాలంలోనే 32 లక్షల ఫోన్‌కాల్స్ రావడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో డిజిటల్ అడిక్షన్‌ను నిరోధించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు చేపట్టిన కార్యక్రమాలను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. పాఠశాలలు, స్కూలు బస్సుల్లో సురక్షిత ఇంటర్నెట్ వాడకానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), స్క్రీన్ టైమ్ లిమిట్, ఆన్లైన్ సేఫ్టీపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కొన్ని మార్గదర్శకాలు జారీచేసినట్టు వెల్లడించింది. డిజిటల్ అడిక్షన్‌ను తగ్గించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ యూత్ హబ్స్ ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఆయా ప్రదేశాల్లో ఆల్టర్నేట్ డిజిటల్ స్పేస్‌లు ఏర్పాటు చేయాలని తెలిపింది. పాఠశాలల్లో ‘డిజిటల్ వెల్నెస్’, సైబర్ సేఫ్టీ, మానసిక ఆరోగ్యంపై పాఠ్యాంశాలు బోధించాలని పేర్కొన్నది.
డిజిటల్ అడిక్షన్తో మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యార్థులు చదువులో వెనుకబడతారు. సామాజిక సంబంధాలు తగ్గుతాయి. దీన్ని నిరోధించాలంటే స్క్రీన్‌టైమ్‌ను నియంత్రించుకోవాలి. రోజుకు కనీసం 1-2 గంటలు ఫోన్ లేకుండా గడపడం అలవాటు చేసుకోవాలి. ఫోన్‌కు బదులు నడక, క్రీడలు, యోగా వంటివి చేయాలి. తద్వారా మెదడుకు విశ్రాంతి లభించి భావోద్వేగాల సమతుల్యత మెరుగుపడుతుంది. మెదడులో డోపమైన్, సెరటోనిన్ లాంటి సానుకూల రసాయనాలు పెరగడం ద్వారా డిప్రెషన్ తగ్గుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్ వాడకూడదు. కనీసం గంట ముందే ఫోన్ చూడటం ఆపేయాలి. లేకుంటే స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. పిల్లలు చిరాకు పడటం, ఒంటరిగా ఫీల్ కావడం, చదువుపై ఆసక్తి తగ్గడం లాంటి లక్షణాలను డిజిటల్ అడిక్షన్‌కు సంకేతాలుగా భావించాలి. అవసరమైతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవాలి.