హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో వేల మంది వలస కూలీల ఆకలి తీర్చేందుకు పోలీస్‌శాఖ చేపట్టిన సేవా ఆహార్ కార్యక్రమంలో గజ్వేల్ శ్రేయోభిలాషులు సంస్థ అందించిన తోడ్పాటు బాగుందని మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి ప్రశంసించారు. శుక్రవారం లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్‌శాఖ తరఫున సంస్థకు చెందిన 25 మంది సభ్యులకు సేవా శిరోమణి అవార్డులు అందజేశారు. సేవా ఆహార్లో 50 వేల మందికి భోజనాలు పెట్టేందుకు టన్నుల కొద్ది కూరగాయలు, ఇతర సామగ్రిని ఎంతోమంది అందించారని డీఐజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రేయోభిలాషుల వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి, చైర్మన్ వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.