పక్క చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బోడ మహేందర్‌రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లె గ్రామం. నాలుగెకరాల్లో సన్నరకం వరి సాగు చేయగా.. 92 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నవంబర్ 25న బోగంపాడు పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. క్వింటాల్‌కు రూ.500 చొప్పున మొత్తం రూ.46 వేల బోనస్ రావాలి. పదిహేను రోజుల్లోనే బోనస్ డబ్బులు వేస్తామని చెప్పి రెండు నెలలైనా పడలేదు. ఇలా ఒక్క మహేందర్ రెడ్డే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల పైచిలుకు రైతులు బోనస్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హుజూరాబాద్: అధికారంలోకి రాగానే వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోసన్ చెల్లిస్తామని రైతులకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చకుండా రెండు సీజన్లకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మాట మార్చి ‘సన్న వడ్లకే బోనస్’ అంటూ వానాకాలం సీజన్లో అమలు చేసింది. పాలకుల మాటలను నమ్మిన రైతులు బోనస్ వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రాల్లోనే సన్నాలను విక్రయించారు. రెండు నెలలైనా బోనస్ డబ్బులు వేయలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇంకా రూ.41 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు బకాయిలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
బహిరంగ మార్కెట్‌ను కాదని
వానాకాలంలో బహిరంగ మార్కెట్లో సన్నరకం ధర క్వింటాల్‌కు రూ.2,750 పలికింది. రేవంత్ సర్కారు మద్దతు ధరతోపాటు.. రూ.500 బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వారి మాటలు నమ్మి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర దక్కక, బోనస్ అందక లబోదిబోమంటున్నారు. కనీసం ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు, అధికారులకు స్పష్టత లేదు. మరోవైపు రైతుభరోసా కూడా ఇవ్వకపోవడంతో మళ్లీ అప్పుల కోసం వెంపర్లాడే దుస్థితి తలెత్తింది.
సర్కారు మాపై దయచూపాలె
బోగంపాడు పీఏసీఎస్ కేంద్రంలో నవంబర్ 23న 134 క్వింటాళ్ల దాన్యం అమ్మిన. రూ.67 వేలు బోనస్ డబ్బులు ఇప్పటివరకు రాలేదు. అధికారులను అడిగితే తెల్వదంటున్రు. బ్యాంకులకు వెళ్తే ఇంకా రాలేదంటున్రు. గట్టిగా అడిగితే అధికారులు కోపానికి వస్తున్రు. సర్కారుకు ఇవ్వడం ఏందీ? ఇచ్చిన తర్వాత బాధపడుడేంది? అని ఇప్పుడనిపిస్తంది. సర్కారు మాపై దయచూపాలె.
– పైండ్ల రాజిరెడ్డి, మర్రివానిపల్లి
రెండు నెలలైనా బోనస్ రాలే
ఎకరంలో 21 క్వింటాళ్ల దిగుబడి అచ్చింది. నవంబర్ 28న అమ్మిన. ఇప్పటివరకు బోనస్ రాలే. వస్తాయో రావో తెల్వది. నా లెక్కన చాలా మంది రైతులు బోనస్ కోసం చూస్తున్రు. మేం అమ్మే సమయానికి బయట మార్కెట్లో రేటు బాగానే ఉంది. బోనస్ వస్తుంది కదా అని ఆశపడి ప్రభుత్వానికే అమ్మితే గిట్ల బోనస్ ఇయ్యకుండా గోస పెడుతంది.
– చిలుకమారి మహేందర్, కాట్రపల్లి, హుజూరాబాద్ మండలం