హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో సామాన్యులు బస్సుల్లో పడుతున్న బాధలు ఇన్నన్ని కావు. పురుషులకు సీట్లు దొరకడం లేదు. వృద్ధుల సీట్లూ ఖాళీగా ఉండడం లేదు. ఒంట్లో సత్తువ లేని ఓ వృద్ధుడు తప్పని పరిస్థితుల్లో బస్సెక్కి పడ్డ అవస్థల్ని కండ్లకు కట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాళ్లూచేతులు వణుకుతున్న వృద్ధుడిని పట్టుకొని ఉన్న యువకులు సీటు కోసం అందరినీ ప్రాధేయ పడుతున్న దృశ్యాలు సామాన్యుల కష్టాలను కండ్లకు కడుతున్నాయి. టికెట్కు డబ్బులు చెల్లించి కష్టాలు ‘కొని’తెచ్చుకోవడం ఏంటో అంటూ వీడియో చూసిన వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కొన్న వృద్ధులకు కూడా కష్టాలు ‘ఉచితమే’ అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు మరికొందరు. ఇటీవల దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించిన టీఎస్ఆర్టీసీ వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.