హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రానికి మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. ఈ క్రమంలో అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమగాలులే ఈ భిన్న వా తావరణానికి కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. రెండ్రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది.
అదేవిధంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. కాగా, ఉమ్మడి వరంగల్, పాలమూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. బుధ,గురువారాల్లో నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, హైదరాబాద్, జయశంకర్-భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కు రిసే అవకాశం ఉన్నదని వివరించింది.