హైదరాబాద్/బడంగ్‌పేట , ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): రేషన్, సంక్షేమ పథకాలకు వేర్వేరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. కొత్త పెన్షన్లు సైతం త్వరలో మంజూరు చేస్తామన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆదివారం ఆయన సచివాలయంలో ప్రజావాణి పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణిలో అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ముఖం చాటేసిన భట్టి
సమస్యలు విన్నవించేందుకు తమకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమయం ఇవ్వకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కుర్మల్‌గూడ నల్లపోచమ్మ ఆలయంలో జరిగే బోనాల ఉత్సవాలకు భట్టి హాజరవుతున్నారని తెలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కుర్మల్‌గూడ, నాదర్గుల్ రైతులు భారగీ తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.