BRS | హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ఎవరి పెత్తనం వారిదేనని, ఏకాభిప్రాయం ఉండబోదని మరోసారి నిరూపితమైంది. ఇండియా కూటమి సమావేశాలకు బీఆర్ఎస్ హాజరుకాకపోవడంపై కాంగ్రె స్ నేత రాహుల్‌గాంధీ ఒక రకంగా, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మరోరకంగా మా ట్లాడారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడుతూ.. ఇండియా కూట మి సమావేశాలకు బీఆర్ఎస్ కావాలనే హాజరుకావడం లేదని, బీజేపీకి దగ్గరగా ఉంటున్నదని అసత్య ఆరోపణలు చేశారు. ఇదే అంశం పై జూలై 2న ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రె స్ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ‘బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో బీఆర్ఎస్కు ఆహ్వానంపై చర్చ వచ్చింది. అప్పుడు కూటమి పార్టీలకు ఒకటే విషయం చెప్పాను. మీటింగ్‌కు బీఆర్ఎస్ వస్తే మేము రాబోమని, సమావేశంలో బీఆర్ఎస్తో కలిసి కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన’ అని పేర్కొన్నారు.
ఇలా ఒకే అంశంపై ఆ పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు నెల వ్యవధిలోనే తలోరకంగా మాట్లాడటం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓ సిద్ధాం తం, పాలసీ అంటూ ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పబ్బం కోసం బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరకపోవడంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలకు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కాదని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానమని ప్రకటించారు. అందుకే బీఆర్ఎస్ ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నదని స్పష్టంచేశారు. రాజకీయ పెత్తనం కోసం అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.