గద్వాల, జూన్ 25: కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల మధ్య సమోధ్య కుదిర్చి, పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం జోగుళాంబ గద్వాల జిల్లాకు ఇన్చార్జీలను పంపింది. కాగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత బుధవారం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటుచేసి తమ విభేదాలను బయటపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో సరిత ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేయగా, ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథ్, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌జాన్ తొలుత సరిత ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సరిత తమ గోడును వెల్లబోసుకున్నారు. పార్టీ కోసం తాము కష్టపడి కాంగ్రెస్ జెండా మోస్తే జెండాలు మోస్తే.. నామినేటెడ్ పదవులు మరొకరు పొందుతున్నారని తెలిపారు. అధికార పార్టీలో ఉన్నా తమ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరినవారికి ఆలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారని తమకు మాత్రం గుర్తింపు లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదని చెప్పారు. వారి సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఇన్చార్జి విశ్వనాథ్ హామీనిచ్చారు. అనంతరం వారు ఎమ్మెల్యేల నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఎట్లా ఏర్పాటు చేస్తాడని, ఆ పార్టీ ఇన్చార్జిని ఎలా ఆహ్వానిస్తాడని పట్టణంలో చర్చ జరుగుతున్నది.