హనుమకొండ, జనవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన మంత్రులైన కొండా సురేఖ, ధనసరి సీతక్క మధ్య దూరం, వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో పొంగులేటి అతి జోక్యంపై అసహనం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు.. మరోసారి తమ అసమ్మతిని చెప్పకనే చెప్పారు. అభివృద్ధి నిధుల కేటాయింపు, మేడారం జాతర పనులు, కాంట్రాక్టులు, కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని మంత్రులు సీతక్క, సురేఖ కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి పొంగులేటి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయా జిల్లాల అధికారులకు, మీడియాకు ఒకరోజు ముందుగానే సమాచారం అందించారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. మహిళా మంత్రుల రాకపై స్పష్టత లేకపోవడంతో పొంగులేటి గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టారు. మంత్రులు సురేఖ, సీతక్క కోసం ఆరా తీసినా ఫలితం లేక పోయింది. ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్టు ఆ ఇద్దరు మంత్రుల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఇన్చార్జి మంత్రి పొంగులేటి కంగుతిన్నారు.
మధ్యాహ్న భోజన సమయానికే సమీక్ష సమావేశం ముగియాల్సి ఉన్నది. కానీ సురేఖ, సీతక్క రాకపోవడంతో సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్టు పొంగులేటి సంబంధిత అధికారులకు చెప్పారు. భోజన విరామ సమయంంలో పొంగులేటి స్వయంగా సీతక్కకు ఫోన్ చేసి రావాలని పలుమార్లు కోరారు. ఈలోపు సీతక్క సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆమె కోసమే రెండో దశ సమీక్ష అని చెప్పిన పొంగులేటి కొద్దిసేపటికే సమవేశాన్ని ముగించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి కూడా సమావేశానికి రాకపోవడం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం సందర్భంగా యూరియా సరఫరాలో ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా సమస్య ఉంటున్నదని, అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే ఇలా జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్‌పై ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం అందడంలేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమావేశంలో ఇన్చార్జి మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేశారు. తీరు మార్చుకోవాలని, ప్రొటోకాల్ పాటించాలని మంత్రి పొంగులేటి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 7: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం, జనగామ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన హనుమకొండలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కీలక సూచనలు చేశారు. యాప్‌లు, కార్డుల కారణంగా రైతులకు యూరియా అందడం లేదని, రైతాంగానికి ఇవ్వాలనుకున్నదాన్ని ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత యాసంగి సన్నధాన్యానికి బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. జనగామ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లలో ఎల్-3 నుంచి ఎల్-1కు మార్పు సమయంలో అర్హులైన కుటుంబాలు కష్టాలు పడుతున్నాయని, కిరాయి ఇండ్లలో ఉన్నవారిని అర్హులు కాదని అధికారులు తిరసరించి ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. జనగామలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు మరమ్మతులుంటే పూర్తిచేసి, త్వరితగతిన లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. గానుగుపహాడ్‌లో బ్రిడ్జి పనుల కోసం రూ.95 లక్షలు విడుదల చేయాలని, చీటకోడూరు బ్రిడ్జిని వెంటనే మంజూరు చేయాలని పల్లా కోరారు.