బోగి దగ్ధమైన సమీపంలోనే 20 వేల లీటర్ల డీజిల్ ట్యాంక్
తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు అతి సమీపంలో రైళ్లకు డీజిల్ నింపే ట్యాంక్ ఉన్నది. అందులో 20 వేల లీటర్ల డీజిల్ ఉన్నది. దానికి మంటలు అంటుకొని ఉంటే భారీ విస్పోటనమే సంభవించేది.
చర్చలకు ససేమిరా..
ప్లాట్‌ఫామ్స్ ఖాళీచేసి 10 మంది చర్చలకు రావాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు. ‘మా డిమాండ్లు మీ పరిధిలో లేవు, మీతో చర్చలు చేసి ఏమి లాభం’ అంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకాన్ని విరమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. సాయంత్రం తర్వాత వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు
రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత నేపథ్యంలో నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. స్టేషన్‌కు వచ్చిపోయే దారులను మూసేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చే బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6 గంటల తరువాత అన్ని రూట్లను పునరుద్ధరించడంతో పరిస్థితి చక్కబడింది.