హైదరాబాద్ : ఆరోగ్యశాఖలో ఆహారం అందించే సంస్థల్లో పారిశుధ్య భద్రత, ఫుడ్స్, పారిశుధ్య నిర్వహణ ఏజెన్సీల్లో 16శాతం దళితులకు రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంపై దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశలోనే దళితుల కోసం కృషి చేస్తున్నందుకు డిక్కీ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది.
దళితబంధు కార్యక్రమం, ఆరోగ్యశాఖలో కల్పిస్తున్న రిజర్వేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లాల్లో అవసరమైన చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించి, అర్హులన వారిని గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు డిక్కీ తరఫున టెక్నాలజీ, మార్కెట్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించి అమలు దిశగా ప్రయత్నం చేస్తామని డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ చంటి, సౌత్ ఇండియా కో ఆర్డినేటర్ కత్తెర పాక రవి, ట్రైబల్ కో ఆర్డినేటర్ సురేష్ పేర్కొన్నారు.