హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు డయల్-100కు కాల్చేసిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేవారు. ఇప్పుడు గంటల తరబడి స్పందన కరువవడంతో ఈ సేవలపై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెస్పాన్స్ సమయం గంటల తరబడి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థను ఆధునీకరించింది. ప్రజలకు వేగంగా సేవలందించేందుకు టెక్నాలజీని జోడించింది. డయల్ 100కు కాల్ చేయగానే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, పోలీస్‌స్టేషన్‌కు ఒకేసారి మేసేజ్ వెళ్లేలా వ్యవస్థను రూపొందించిది. అర్బన్ ప్రాంతాల్లో 5 నుంచి 8 నిమిషాల్లోనే పోలీసులు చేరుకునేవారు. నేడు ఆ వ్యవస్థ కుప్పకూలిపోయింది.
100కు ఫోన్ చేస్తే గంటలు గడిచినా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు తెలంగాణ పోలీసులకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్లపై హ్యాకర్లు విరుచుకుపడి డాటాను అపహరించారు. నెలరోజుల కావస్తున్నా అప్లికేషన్లు, వెబ్సైట్లను పునరుద్ధరించలేదు. టీఎస్కాప్స్లో డయల్ 100 వ్యవస్థను రెండు రోజుల క్రితం పునరుద్ధరించినా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. టీఎస్కాప్పై టెక్నికల్ ఆడిట్ ఇంకా కొనసాగుతున్నదని, అందుకే పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదని, డయల్ 100 కూడా ఇబ్బందుల్లో ఉందని ఐటీ సెల్ అధికారులు పేర్కొంటున్నారు.
యాప్‌లు హ్యాక్ కాకముందు ఫిబ్రవరిలో సైతం సరూర్‌నగర్, మీర్పేట్ ఠాణాల పరిధిలో కొన్ని ఫిర్యాదులపై ఆరాతీయగా 2 గంటల నుంచి 2 రోజుల దాకా రెస్పాన్స్ లేదని తెలిసింది. తమకు బాధితుల ఫోన్ నంబర్ చేరేసరికి అరగంట నుంచి గంట దాకా సమయం పడుతున్నదని పెట్రోలింగ్ సిబ్బంది సైతం వాపోతున్నారు. గతంలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందిపై నిరంతరం పర్యవేక్షణ ఉండడంతో జవాబుదారీతనంతో సేవలందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత భారీగా బదిలీలు జరగడంతో కొత్తగా వచ్చినవారికి వ్యవస్థపై అవగాహన లేక సేవలు ఆలస్యమవుతున్నాయనే వాదనలువస్తున్నాయి.