నల్లగొండ ప్రతినిధి, మే 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సీన్ లేదని, ఆ పార్టీ కప్పల తక్కెడ లాంటిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవాచేశారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సీఎం పీఠం ఎక్కాలని, రాష్ర్టాన్ని దోచుకోవాలనే దుగ్ధ చాలా ఉన్నదని విరుచుకుపడ్డారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోకర్‌కు తకువ, బఫూన్‌కు ఎక్కువ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేతల మధ్య ఐక్యత పెంచేందుకే కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ సభలు ఏర్పాటుచేసుకొన్నారని ఆరోపించారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసేందేమీ లేదని, వాళ్లకు తెలంగాణలో ఓట్లడిగే నైతిక అర్హత లేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేవలం అధికారంపై యావతోనే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విభజన హామీలను పక్కనపెట్టడంతోపాటు ఒక్క మేలు చేయని బీజేపీకి రాష్ట్రంలో స్థానంలేదని స్పష్టంచేశారు.
అత్యున్నత ప్రధాని పదవిలో ఉండి నరేంద్ర మోదీ కర్ణాటక ప్రచారంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా జై బజరంగ్భళి నినాదాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. సర్వమతాలకు నిలమైన దేశంలో ప్రధానమంత్రి తీరు మత సామరస్యానికి తీవ్ర విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితువు పలికారు. కాంగ్రెస్, బీజేపీకి భిన్నంగా తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని ఉద్ఘాటించారు. అందుకే సీఎం కేసీఆర్ పాలనపైన, బీఆర్ఎస్పైన తెలంగాణ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందని.. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖామయని ధీమా వ్యక్తంచేశారు. స్వయం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఢిల్లీ కేంద్రంగా పని చేసే బీజేపీ, కాంగ్రెస్‌కు పాలన అప్పగిస్తే తెలంగాణకు అధోగతి తప్పదని హెచ్చరించారు. సూట్‌కేసుల సంసృతికి నెలవైన జాతీయ పార్టీల్లో షోకాజ్ నోటీసులకు కూడా ఆ పార్టీలు ఢిల్లీ టు హైదరాబాద్ తిరుగాలని ఎద్దేవా చేశారు. తన కుమారుడు అమిత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై స్పందిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.
బీజేపీ హయాంలోనే రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం
సచివాలయం, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ పదవిలో తాను హాజరు కావడాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై గుత్తా మండిపడ్డారు. గవర్నర్లతో రాజకీయం చేయిస్తూ ఆ వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం బీజేపీకే చెల్లిందని విమర్శించారు. తమపై విమర్శలు చేసే నైతిక హక్కు బండి సంజయ్‌కు లేదని హితవు పలికారు. పార్టీ బీఫామ్లపైనే ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభాపతులుగా ఎన్నికవుతారని గుర్తుచేశారు. ఎన్నికల్లో సభాపతులపై ప్రత్యర్థి పార్టీలు పోటీ పెట్టరాదన్న చట్టం తెస్తే, ఎన్నికైన పార్టీలకు దూరంగా సభాపతులు నడుచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌గా తాను, స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి చాలా హుందాగా వ్యవహరిస్తున్నామని స్పష్టంచేశారు.