శంకరపట్నం, ఏప్రిల్ 9 : పంటల సాగుకు ఎస్సారెస్పీ నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేశవపట్నం, కరీంపేట్ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వకపోతే దాదాపు 300 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం వారు శంకరపట్నంలోని జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కాల్వ ద్వారా సాగునీటిని నిలిపివేయడంతో పూత, పొట్ట దశలో ఉన్న వరి చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆవేదన చెందారు. నెలాఖరు వరకు కాల్వ ద్వారా సాగునీటిని అందించి ఆదుకోవాలని వేడుకున్నారు. ధర్నాతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా, ఏఎస్సై సుధాకర్.. రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
నేను పదెకరాల్లో వరి పెట్టిన. అది పొట్ట దశలో ఉన్నది. ఇప్పుడు కాల్వ నీళ్లు బంద్ జేసిన్రు. ఒకటి, రెండు తడులైతే పంట చేతికత్తది. నీళ్లు ఇవ్వకపోతే కేశవపట్నం, కరీంపేట్ గ్రామాల్లోని దాదాపు మూడు వందల ఎకరాల్లో ఉన్న పంటలు ఎండిపోతయి. సర్కారోళ్లు ఎట్లన్న జేసి ఈ నెలాఖరు దాక కాల్వ నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలె.