న్యాల్కల్, సెప్టెంబర్ 3: ఫార్మాసిటీ వద్దే వద్దని, జీవనాధారంగా సాగుచేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు స్పష్టంచేశారు. మంగళవారం న్యాల్కల్లో ఆయా గ్రా మాలకు చెందిన వివిధ పార్టీల నాయకు లు, భూబాధితులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోని న్యాల్కల్-ముంగి ప్రధాన రోడ్డు మార్గంలో రాస్తారోకో, ధర్నా చేశారు. ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా సరే.. ఫార్మాసిటీకి భూ ములు ఇవ్వబోమని స్పష్టంచేశారు. ఫార్మాసిటీతో ఈ ప్రాంతమంతా విషపూరితమయ్యే ప్రమాదముందని తెలిపారు.
పచ్చని పొలాలు గుంజుకుని ఫార్మాసిటీ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తాంగానీ.. భూములు మాత్రం వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. తమ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకునే వరకూ పార్టీలకతీతంగా ప్రజలు, రైతులందరూ కలిసి మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆనంతరం తహసీల్దార్ భూపాల్ను కలిసి ఫార్మాసిటీకి భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ వినతిపత్రాన్ని అందజేశారు.