ఏటూరునాగారం, అక్టోబర్ 7: తమకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు(Pending wages) చెల్లించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న ఎఎన్ఎంలు( ANMs Dharna) సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ(ITDA) వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ.. 60 మంది ఏఎన్ఎంలు ఔటు సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా ఎనిమిది నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నప్పటికీ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
హాస్టల్స్లో మెడికల్ కిట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఎన్ఎంలకు యూనిఫాంలు, గుర్తింపు కార్డులు అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీడీవో పోచం ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చి సమన్వయం చేసి విరమింపజేశారు. అనంతరం ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావూద్, దేవేందర్, ఏఎన్ఎంలు స్వరూప, రాజమణి, శాంతకుమారి, జ్యోతి, స్రవంతి, సుమలత, పల్లవి, ఈశ్వరి, కల్పన, సరస్వతి, సుధారాణి, విజయకుమారి, గంగ, వినోద, శ్రీలేఖ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.