చెన్నూర్ రూరల్/నవాబ్‌పేట/ధర్మసాగర్, ఏప్రిల్ 13 : తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు. రెండు నెలలుగా తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా వెంకంపేటలోని దెబ్బగూడెం(ఎస్సీ కాలనీ)లో మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
రెండు నెలలుగా నీటి ఎద్దడి నెలకొన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా రుక్కంపల్లి వాసులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య నిరసనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫోన్లో రాంచంద్రయ్యతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ప్రజలు ధర్నాకు దిగారు.