హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ ‘కగార్’ వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకులు, వివిధ పార్టీల నేతలు ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్కాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో శాంతి చర్చల కమిటీ సభ్యులు జస్టిస్ బీ చం ద్రకుమార్ మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలకు పూనుకుంటే 50 ఏండ్ల నుంచి నలుగుతున్న సమస్యకు పరిష్కారం లభించేదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతులేని బలప్రయోగానికి పాల్పడుతున్నదని ప్రొఫెసర్ జీ హరగోపాల్ ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తూ మానవ హననానికి పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. దేశంలో పేదరికం, అసమానతల నిర్మూలనకు పాలకులు చర్యలు తీసుకుంటే వామపక్షాలు ఉద్యమించాల్సిన అవసరమే ఉండదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఈరవత్రి అనిల్, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధి వేములపల్లి వెంకట్రామయ్య తదితరులున్నారు.