ఇటిక్యాల, నవంబర్ 1: ‘ఉడికీ.. ఉడకని అన్నం ఎలా తినాలి.. నీళ్ల పాలు తాగలేకపోతున్నాం.. చికెన్ నీళ్లుగా చేస్తున్నారు.. పుచ్చిపోయిన పల్లీలతో చట్నీ చేస్తున్నారు.. తాగేందుకు నీళ్లు లేవు’ అంటూ ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు ఆవేదన చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో శుక్రవారం రాత్రి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా శనివారం హాస్టల్‌ను బీసీ సంక్షేమ సీఈవో అలోక్‌కుమార్, డీఈవో విజయలక్ష్మి సందర్శించగా విద్యార్థులు తమగోడు వెల్లబోసుకున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్ కలిపి ఉడకని కూర చేశారని, మజ్జిగ, గుడ్డు తినడంతో కడుపునొప్పితోపాటు వాంతులు అయ్యాయని తెలిపారు. 55 మంది విదార్థులు అస్వస్థతకు గురైతే రాత్రికి రాత్రే గద్వాలకు దవాఖానకు తరలించారని, వారిలో 32 మందిని శనివారం హాస్టల్‌కు తీసుకురాగా.. 23 మంది దవాఖానలోనే ఉన్నారని చెప్పారు. స్పందించిన సీఈవో వార్డెన్ జయరాములను సస్పెండ్ చేసి, వర్కర్లను మార్చనున్నట్టు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే: ఎమ్మెల్యే విజయుడు
అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. గద్వాల దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించారు. దవాఖానలోని చిన్నారులకు ఉదయం 9గంటలు దాటినా అల్పాహారం అందించకపోవడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత హన్మంతునాయుడు, బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సి టీ అధ్యక్షుడు గడ్డం భరత్ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను కలెక్టర్ సంతోష్ పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు బాయిల్డ్ ఎగ్స్ కారణమని ఆరోపణలు వస్తుండటంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు శాంపిల్స్ పంపించి పరీక్షలు చేయిస్తామని తెలిపారు. వసతి గృహాల్లో ముగ్గురు విద్యార్థులను ఫుడ్ కమిటీలో ఉంచామని చెప్పారు.
సుమోటగా స్వీకరించిన హెచ్చార్సీ
విద్యార్థులకు పుడ్‌పాయిజన్ ఘటనను రా ష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటగా స్వీకరించింది. 55మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఆహార భద్రత, పరిశుభ్రతపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సమగ్ర నివేదికను ఈనెల 24 ఉదయం11 గంటల వరకు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గడువు విధించింది.
మరో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎర్రవల్లి మండల కేంద్రంలో షేక్పల్లె రోడ్డు వైపు ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల (అయిజ) కళాశాలలో ఉదయం అల్పాహారం చేసిన కొద్దిసేపటికే భరత్(బైపీసీ), శ్రీను(ఎంపీసీ), అఖిల్ వాంతులు చేసుకున్నారు. వెంటనే వీరిని గద్వా ల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి నిలకడగానే ఉన్నదని ప్రిన్సిపాల్ రామాంజనేయులు తెలిపారు. అడిషినల్ కలెక్టర్ నర్సింగ్‌రావు పాఠశాలను సందర్శించారు.