హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : సముద్రంలో వృథాగా పోయే గోదావరి నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్లపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుటుందని చెప్పారు. బనకచర్లపై కేంద్రం కనీసం ప్రీఫిజిబులిటీ డాక్యుమెంట్లు కూడా చూడలేదని తెలిపారు.
బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుకు.. ఆయన ప్రియమైన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారా? మాట్లాడారా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తనను పిలవలేదని, మహేశ్‌కుమార్‌గౌడ్ ఫోన్‌ను ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తంచేశారు. బనకచర్లపై అఖిలపక్షం సమావేశానికి ఎవరు హాజరవ్వాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.